TET:టీచర్లే ఫెయిలయ్యారు!

2
- Advertisement -

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET జూన్-2026) ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ప్రమాణాలపై సరికొత్త చర్చకు దారితీశాయి. సోమవారం విడుదలైన ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారులను తీవ్ర విస్మయానికి గురిచేశాయి. రోజువారీగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఇన్-సర్వీస్ (ప్రభుత్వ, కేజీబీవీ కాంట్రాక్టు) ఉపాధ్యాయులలో మెజారిటీ శాతం మంది ఈ పరీక్షలో క్వాలిఫై కాలేకపోయారు.

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా.. వారిలో కేవలం 8,809 మంది (37.29 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్ అయ్యారు. గత ఏడాది టెట్ పరీక్షతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది.

గత టెట్ పరీక్షలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత దాదాపు 50 శాతానికి పైగా నమోదైంది. ఈసారి అది కేవలం 37.29 శాతానికే పరిమితమైంది. ఇదే పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 45.66% గా ఉంది. అంటే ప్రస్తుతం విధుల్లో ఉండి పాఠాలు చెబుతున్న టీచర్ల కంటే నిరుద్యోగ అభ్యర్థులే 8.37% ఎక్కువగా ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

టెట్ ప్రవేశపెట్టకముందు నియమితులై… కనీసం ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2028 ఆగస్టు లోపు టెట్ క్వాలిఫై కాకపోతే సదరు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే డెడ్‌లైన్ విధించింది.

సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న తరుణంలో, తాజా ఫలితాలు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా టెట్ క్వాలిఫై కాని ఉపాధ్యాయులు తదుపరి నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించకపోతే ఉద్యోగ గండం తప్పేలా లేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలకు ఈ ఫలితాలు బల చేకూరుస్తున్నాయి.

Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు

- Advertisement -