మధుమేహం (టైప్ 2 డయాబెటిస్) అనగానే చాలామంది స్వీట్లు తినడం ఆపాలని, చక్కెర తగ్గించాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో డయాబెటిస్ పెరగడానికి ఒక వింతైన ప్రధాన కారణం వెలుగుచూసింది. భారతీయుల్లో సరైన మోతాదులో పండ్లు తినకపోవడమే మధుమేహానికి అతిపెద్ద కారణమని ఒక అంతర్జాతీయ పరిశోధన స్పష్టం చేసింది.
ప్రఖ్యాత ‘డయాబెటిస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం..2023 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) డేటాను విశ్లేషించింది. ఆసియాలోని 34 దేశాల్లో ఆహారపు అలవాట్ల లోపాల వల్ల మాత్రమే 2023లో దాదాపు 2.14 లక్షల మంది మధుమేహంతో మరణించినట్లు వెల్లడించింది. ఇందులో కేవలం పండ్లు తగినంత తినకపోవడం వల్లే అత్యధికంగా 86,000 మరణాలు సంభవించాయని తేలింది.
ఆసియా అంతటా డయాబెటిస్ వ్యాప్తి ఒకేలా లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు దీనికి దారితీస్తున్నాయి.చైనా, తూర్పు ఆసియా దేశాల్లో ఇక్కడ ఎక్కువగా రెడ్ మీట్ (పచ్చి మాంసం), ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల డయాబెటిస్ పెరుగుతోంది. జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఇక్కడ ప్రాసెస్డ్ మీట్ ప్రధాన విలన్‌గా మారింది.
భారత్ మరియు దక్షిణాసియాలో ఇక్కడ మాంసం కంటే.. పండ్లు మరియు తృణధాన్యాలు తీసుకోకపోవడమే అతిపెద్ద లోపంగా మారింది. భారతదేశంలో ఒకసారి డయాబెటిస్ అని తెలియగానే చాలామంది డాక్టర్లు చెప్పకపోయినా సొంతంగా పండ్లు తినడం పూర్తిగా ఆపేస్తారు. పండ్లలో ఉండే సహజ చక్కెర వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయనే అపోహే దీనికి కారణం. కానీ నిజానికి పండ్లు తినకపోవడం వల్లే శరీరానికి అందాల్సిన పీచుపదార్థం (ఫైబర్), విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అందకుండా పోతున్నాయని, ఇది జీవక్రియలను మరింత దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయులు తీసుకునే ఆహారంలో 62 శాతం కేలరీలు కార్బోహైడ్రేట్ల (ముఖ్యంగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యం, మైదా) నుంచే వస్తున్నాయి. పీచు పదార్థాలు ఉండే తృణధాన్యాలను దూరం పెడుతున్నారు. దీనికి తోడు ప్రోటీన్ లోపం, పండ్లు తినకపోవడం మధుమేహాన్ని మరింత పెంచుతోంది అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో 60 శాతానికి పైగా ఆసియాలోనే ఉన్నారు. అందులో భారత్, చైనా, పాకిస్థాన్లలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు డయాబెటిస్ అవగాహన కార్యక్రమాలన్నీ “ఏవి తినకూడదు” అనే దానిపైనే దృష్టి పెట్టాయి. కానీ, ఇప్పుడు “ఏవి తగినంతగా తినాలో” చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
Also Read: రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు
కీటో డైట్లు లేదా ఇతర పాశ్చాత్య దేశాల పద్ధతులను గుడ్డిగా అనుసరించడం కంటే.. స్థానికంగా లభించే పండ్లను క్రమం తప్పకుండా తినడం, పాలిష్ చేసిన బియ్యానికి బదులు పొట్టు తీయని తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడమే భారతీయులకు అసలైన రక్షణ అని వైద్యులు సూచిస్తున్నారు.

