అందరిచూపు బంకీపూర్‌పైనే!

2
- Advertisement -

బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల బరిలో ఎన్డీయే కూటమి బల ప్రదర్శన చేపట్టింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి అభిషేక్ కుమార్ అలియాస్ ‘బంటి’ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ నేతలు తమ అభ్యర్థి విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

గత ఐదు పర్యాయాలుగా ఈ స్థానం నుండి విజయం సాధించిన నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నామినేట్ అయి అనంతరం రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. పాట్నా నగర పరిధిలోని బంకీపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి బలమైన కోటగా గుర్తింపు పొందింది.

మరోవైపు రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన జన్ సూరాజ్ పార్టీ (JSP) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగేట్రానికి వేదిక కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన జన్ సూరాజ్ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరుకు ప్రజా తీర్పుగా అభివర్ణించిన ఆయన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఇక్కడ రేఖా గుప్తాను బరిలోకి దించడంతో త్రిముఖ పోరు నెలకొంది. ప్రశాంత్ కిషోర్‌కు మహాఘటబంధన్ మద్దతు లభిస్తుందనే ఊహాగానాలకు ఆర్జేడీ అభ్యర్థి ప్రకటనతో తెరపడింది. బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అభిషేక్ కుమార్ క్షేత్రస్థాయి కార్యకర్తగా నియోజకవర్గంలో మంచి పట్టు కలిగి ఉన్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ లోక్ జనశక్తి పార్టీ నేతలు అభిషేక్ కుమార్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. జూలై 30న పోలింగ్ నిర్వహించి ఆగస్టు 3న ఓట్ల లెక్చంపు చేపట్టనున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తుతో పాటు బీహార్ ప్రస్తుత ప్రభుత్వ ఇమేజ్‌ను నిర్ణయించే ఈ ఉపఎన్నిక ఫలితంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Also Read:Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్‌డేట్

- Advertisement -