అమర్‌నాథ్‌ యాత్ర..భక్తులకు నిరాశ

2
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌ హిమాలయాల్లో అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సుమారు 57 రోజుల పాటు సాగాల్సిన ఈ సుదీర్ఘ వార్షిక యాత్ర కేవలం ఐదు రోజులు పూర్తి చేసుకునే సరికి పవిత్ర మంచు లింగం (బాబా బర్ఫానీ) పూర్తిగా కరిగిపోయింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గుహలోని సహజసిద్ధ మంచు శిఖరం ఇప్పటికే 90 శాతానికి పైగా కరిగిపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆకస్మిక మార్పుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ స్పందిస్తూ అమర్‌నాథ్ శ్రైన్ బోర్డు నిర్వహణను ప్రశ్నించారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఈ హిమాలయ ప్రాంతంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు కేవలం 10,000 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలనే నిబంధనను ఆమె గుర్తు చేశారు. అధికారులు భక్తుల సంఖ్య పెరుగుదలను వేడుకగా చూపిస్తున్నారే తప్ప అక్కడి పర్యావరణ సమతుల్యతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వివాదాస్పద రోప్‌వే ప్రాజెక్టు అవసరం ఉందా అంటూ ఆమె నిలదీశారు.

అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ సూక్ష్మ వాతావరణం (Microclimate) పై మానవ ఉద్గారాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ప్రపంచంలోని ఇతర పర్వత శ్రేణుల కంటే హిమాలయాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న హిమపాతం కారణంగా గుహ పరిసరాల్లో వేడి వాతావరణం నెలకొంది. గతంలో 2018లో 29 రోజులు, 2020లో 38 రోజులు, 2022లో 28 రోజుల్లో మంచు లింగం కరిగిపోగా.. ఈ ఏడాది కేవలం వారం లోపే అంతర్థానం కావడం గ్లోబల్ వార్మింగ్ తీవ్రతకు అద్దం పడుతోంది.

కేవలం వాతావరణ మార్పులే కాకుండా గుహ పరిసరాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. యాత్ర మార్గాలను వెడల్పు చేయడం, భారీ యంత్రాల వినియోగం, విద్యుద్దీకరణ, లంగర్లు (అన్నదాన సత్రాలు) గుహకు అతి సమీపంలోకి తీసుకురావడం వంటి చర్యలు అక్కడి స్థానిక ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. గుహ వద్ద ఇటీవల నిర్మించిన రెయిన్ షెల్టర్ స్థానిక వాతావరణాన్ని మార్చేసిందా అనే కోణంలో స్వతంత్ర శాస్త్రీయ పరిశోధన జరిపించాలని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి అశ్విని హండా డిమాండ్ చేశారు.

Also Read:Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్‌డేట్

యాత్ర ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 93,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, ఆర్‌ఎఫ్ఐడీ (RFID) గుర్తింపు కార్డులు లేని వేలాది మంది అనధికార యాత్రికులు తరలిరావడం భద్రతా సిబ్బందితో పాటు మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి లక్ష లోపు ఉన్న భక్తుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోకి చేరడంతో భక్తుల శరీరాల నుండి వెలువడే వేడి కూడా గుహలోని మంచును వేగంగా కరిగిస్తోందని అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది హిందువుల నమ్మకమైన అమర్‌నాథ్ యాత్రను సజావుగా నిర్వహించడంతో పాటు ఈ హిమాలయ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

- Advertisement -