తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నటుడు ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ మొదటిసారిగా కరూర్ జిల్లాలో అధికారికంగా పర్యటించారు. గత ఏడాది సెప్టెంబర్ 27న ఆయన నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా ఆ విషాదం తర్వాత సీఎం విజయ్ ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో భాగంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి.. ఆ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వేదికగా బాధితుల కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులకు కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు.
అనంతరం ముఖ్యమంత్రి విజయ్ కరూర్లోని కృష్ణరాయపురం పరిధిలోని మానవాసి గ్రామంలో దాదాపు రూ. 1,700 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న ‘ఎవర్వాన్ కొఠారి ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్’ లెదర్ యేతర పాదరక్షల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా సుమారు 13,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ తర్వాత అట్లాస్ కళైయరంగం మైదానంలో ఏర్పాటు చేసిన ‘మక్కల్ సంతిప్పు’ (ప్రజా సంప్రదింపుల సభ) లో దాదాపు 5,000 మంది పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి సీఎం విజయ్ ప్రసంగించారు. తన రాజకీయ ప్రస్థానంలో కరూర్ తొక్కిసలాట సంఘటన తన గుండెల్లో ఎప్పటికీ మానని గాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్డేట్

