ఇటు సూర్యుడు అటు మొలిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే.. భూమి బద్దలైనా తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట లో నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు.. SIR ఓటర్ నమోదు పై అవగాహనా సదస్సు.. ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు, ఆందోల్ మాజీ MLA చంటి క్రాంతికిరణ్, జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి MLA చింత ప్రభాకర్, మాజీ ZP చైర్మన్ జయశ్రీ జయపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఓట్ల గల్లంతుపై కుట్రలు జరుగుతున్నాయి.. SIR ప్రక్రియలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి తీరాలి…రైతులకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే, దాన్ని కట్ చేసి 7-8 గంటలు మాత్రమే ఇచ్చేందుకు ‘రైతు డిస్కం’ పేరుతో రేవంత్ రెడ్డి కుట్ర. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపిస్తాం.
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి అడ్డం, పొడవు మాట్లాడితే.. ఈరోజు ఖుల్లం ఖుల్లా మాట్లాడి వాస్తవాలతో కుండబద్దలు కొడుతున్నాను అన్నారు.
ముఖ్యమంత్రికి చేతనైతే సబ్జెక్ట్ పై మాట్లాడాలి, ఎత్తు పొడవుల గురించి రేవంత్ రెడ్డికి ఎందుకు? పొట్టిగా ఉన్నోడికి పొడుగున్నోడిని చూస్తే ఈర్ష్య పుట్టడం సహజమే…
ఇటు సూర్యుడు అటు మొలిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే. భూమి బద్దలైనా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ఏవి పాలు, ఏవి నీళ్లు అనేది ప్రజలకు మొత్తం అర్థమైంది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీ కొడుకులకు చుక్కలు చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు, ప్రజలంతా మనవైపే చూస్తున్నారు, అందరం కష్టపడి పార్టీని అధికారంలోకి తెద్దాం.ఆందోల్ ప్రాంత ప్రజలకు ప్రాణాధారమైన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ పెట్టిండో సమాధానం చెప్పాలి. ఈ ప్రాజెక్టుల సాధన కోసం బోరంచి అమ్మవారి దగ్గర నుంచి సిద్ధి వినాయక ఆలయం వరకు భారీ పాదయాత్ర చేద్దాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కార్యకర్తలు, నాయకులు పాదయాత్రకు సిద్ధంగా ఉండాలి అన్నారు.
SIR అంటే ఏమిటో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాలి. లేకపోతే ఢిల్లీలో ఉండే బీజేపీ, రాష్ట్రంలో ఉండే ఓటుకు నోటు దొంగతో మన ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లు తీసేయడం వల్లే ఓటమి చెందారని ఆరోపణలు వచ్చాయి.మూడు నెలల క్రితమే జోగిపేటలో ఓటు వేసిన.. నా ఓటు ఎక్కడికి పోతుంది అని ఆదమరిచి ఉండొద్దు. 2002లో SIR ప్రక్రియ జరిగింది, మళ్లీ 24 ఏండ్ల తర్వాత ఇప్పుడు జరుగుతుంది.ఈ నెల 25వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారం నింపి, రెండు కలర్ పాస్ పోర్ట్ ఫోటోలు జతచేసి BLOకి ఇస్తేనే మనకు ఓటు ఉంటుంది. ఫారంను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు.జోగిపేటలో మెప్మాలో పనిచేసే RPలే BLOలుగా ఉంటారు. 2002లో ఓటు హక్కు ఉన్నవారు ఎడమ వైపు ఫారం నింపాలి, లేనివారు కుడి వైపు ఫారం నింపాలి అన్నారు.
ఫ్యామిలీ గ్రూపింగ్ కింద నాన్నమ్మ, తాతయ్య వివరాలు కచ్చితంగా నింపాలి. డ్రాఫ్ట్ లిస్ట్ పై బూత్ లెవల్ ఏజెంట్ సంతకం పెట్టమని అడిగినప్పుడు జాగ్రత్తగా చూసుకొని సంతకం పెట్టాలి…బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఓట్లు పోకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటు ఉంటుంది.రేవంత్ రెడ్డికి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ఆయనకు తన వీపు తానెలా చూసుకోలేడో, వాస్తవాలు కూడా అలాగే కనిపించడం లేదు. ఇంటిలిజెన్స్ వ్యవస్థ సరిగా పని చేయడం లేదో ఏమో కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లోకి వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఊర్లల్లో తిరిగే మొహం లేకుండా రేవంత్ రెడ్డి చేశాడు.విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా బంద్ అయింది. రేవంత్ రెడ్డి విద్యార్థులను పై చదువులకు దూరం చేసిండు. కేసీఆర్ కిట్ బంద్ అయింది, యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ ఆగిపోయింది, దళిత బంధు అటకెక్కింది, ముదిరాజ్ లకు ఉచిత చేప పిల్లలు బంద్ అయింది.రైతులకు ఇవ్వాల్సిన 19 వేల కోట్ల రూపాయల రైతు బంధును రేవంత్ రెడ్డి దారుణంగా ఎగ్గొట్టాడు. రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణమాఫీ ఎక్కడా సరిగ్గా జరగలేదు. యూరియా యాప్ పెట్టి మక్కల రైతులకు యూరియా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆరు నెలల నుంచి రైతు బీమా అతీగతీ లేదు. వానాకాలం పంటల బీమా ఒక్క రైతుకు కూడా రాలేదు. నేడు రైతు అనేవాడు అస్సలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు.వడ్లు కొనుగోలులో తరుగు తీస్తే తోలు తీస్తా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. నేడు దళారుల చేతిలో ఆయనే తోలు బొమ్మ అయిండు అన్నారు.
కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తున్నాడు. కేంద్రం ఎంతకొనమంటే అంతే కొంటాం అన్నప్పుడు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నది దేనికి? పీకడానికా..సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు చేయడం కూడా చేతకాని అసమర్థులు ఈ కాంగ్రెస్ నాయకులు. సింగూరు ప్రాజెక్టు కింద వెంటనే క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.కేసీఆర్ గారు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. దాన్ని కట్ చేసి 7, 8 గంటలే కరెంట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. అందుకోసమే అప్పులు తెచ్చేందుకు కొత్తగా రైతు డిస్కం పేరుతో నాటకాలకు సిద్ధమయ్యాడు. ఆ రైతు డిస్కంకు రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తామని మభ్యపెడుతున్నాడు.రేవంత్ రెడ్డి పాలనలో ఏదీ సక్కగా లేదు, కేవలం ఢిల్లీకి మూటలు మోసుడే బావుంది. కోడిగుడ్లు, పిల్లల స్కూల్ బ్యాగులు, టైల కొనుగోళ్లలో భారీ కుంభకోణాలు చేశారు. గురుకుల టెండర్ల కుంభకోణం పై చర్చించేందుకు నన్ను రమ్మన్నారు.. నేను, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు బయలుదేరితే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఇది వారి పిరికితనానికి నిదర్శనం అన్నారు.
కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు.. రేవంత్ రెడ్డికి ఎట్లాగూ ఎగ్గొట్టే అలవాటు కాబట్టి ఆ పథకానికి రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అని పేరు పెట్టుకుంటే బాగుండేది.

