తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి వ్యవహరించిన తీరు పార్టీలో తీవ్ర అలజడికి కారణమైంది. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ కమిషనర్‌తో కడియం శ్రీహరి నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు హైదరాబాద్‌లో కడియం శ్రీహరి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవదాయ శాఖ కమిషనర్‌ను కూడా ఆహ్వానించి నివేదికలపై చర్చించారు. అయితే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ఈ సమీక్షకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం లేదు.
తన పరిధిలోని శాఖపై తనకు తెలియకుండా ఒక ఎమ్మెల్యే నేరుగా కమిషనర్‌తో రివ్యూ నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ, మంత్రిత్వ శాఖను తక్కువచేసేలా ఈ పరిణామాలు ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read:తొలి హైడ్రోజన్ రైలు..ప్రత్యేకతలివే!
కడియం శ్రీహరి వైఖరిపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదాన్ని ఆమె రాష్ట్ర నాయకత్వం (స్టేట్ కమాండ్) దృష్టికి తీసుకెళ్లకుండా, నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి (హైకమాండ్) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక మంత్రిని దాటవేసి నియోజకవర్గ స్థాయి సమీక్షల పేరిట అధికారులపై ఒత్తిడి తీసుకురావడం పార్టీ నిబంధనలకు విరుద్ధమని ఆమె తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖ రాష్ట్ర నాయకత్వాన్ని కాదని నేరుగా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే ఆరా తీశారు. అసలు ఏం జరిగిందనే విషయమై ఆయన వివరాలు సేకరించారు.మరి ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో, కడియం శ్రీహరి దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

