సంజూపై వేటు..సెలెక్టర్ల షాక్!

3
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలిపి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో (ఐర్లాండ్‌పై 5, 0 మరియు ఇంగ్లాండ్‌పై 1 రన్) విఫలమయ్యాడనే కారణంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతనిపై ఇంత త్వరగా వేటు వేయడం డ్రెస్సింగ్ రూమ్‌లోని మిగతా ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత కొంతకాలంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్‌మెంట్ బ్యాటర్లకు ఒకటే స్పష్టమైన సందేశం ఇస్తున్నారు: “స్వార్థం లేకుండా, జట్టు కోసం భయం లేకుండా ఎక్కువ రిస్క్ తీసుకుంటూ ఆడండి….ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో సంజూ శాంసన్ సరిగ్గా ఇదే చేశాడు. సెంచరీలు లేదా వ్యక్తిగత మైలురాళ్ల కోసం పాకులాడకుండా జట్టు రన్ రేట్ పెంచే క్రమంలోనే అతను అవుట్ అయ్యాడు.

ఈ నిర్ణయం వల్ల జట్టులోని ఇతర ఆటగాళ్లకు “రన్స్ చేస్తేనే జట్టులో ఉంటారు, లేదంటే లేదు’ అనే పరోక్ష సంకేతం వెళ్తుంది. దీనివల్ల ఆటగాళ్లు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి స్ట్రైక్ రేట్ కంటే వ్యక్తిగత పరుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది గంభీర్ ఆశిస్తున్న దూకుడు నమూనాకు పూర్తి విరుద్ధం.

Also Read:7 వేల కోట్లు..9 వారాలకే రోడ్డు క్లోజ్!

భారత జట్టులో ప్రస్తుతం తగినంత మంది కుడిచేతి వాటం బ్యాటర్లు లేరు. అటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్‌లో వేగంగా ఆడగల శాంసన్‌ను పక్కన పెట్టడం జట్టు ప్రయోజనాలకు మంచిది కాదని నిపుణులు భావిస్తున్నారు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సుదీర్ఘ అవకాశం ఇవ్వాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ, ప్రపంచకప్ హీరోను ఇంత అగౌరవంగా అత్యంత వేగంగా జట్టు నుండి తప్పించడం ఒక ఆటగాడిని అవసరానికి ఉపయోగించుకుని వదిలేసినట్లుగా ఉందని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి.

అగార్కర్ అండ్ కో తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం, భవిష్యత్తులో భారత టీ20 బ్యాటింగ్ శైలిని మళ్లీ పాత రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేసే ప్రమాదం ఉంది.

- Advertisement -