శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం ముంబై మరియు రాయ్‌గఢ్ జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో గత 23 గంటల్లో 250-300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.
ముంబైలో గత కొన్ని రోజులుగా రుతుపవనాల కారణంగా తీవ్రమైన వర్షాలు కురుస్తుండగా, నవీ ముంబైలోని బేలాపూర్ గ్రామంలో నిరంతర భారీ వర్షాల వల్ల ఒక పాతబడిన భవనం యొక్క బాల్కనీ కూలిపోయింది. ఆ భవనం చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నట్లు సమాచారం. థానే నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరోవైపు, పశ్చిమ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (CPRO) వినీత్ అభిషేక్ మాట్లాడుతూ, శనివారం రాత్రి నుండి పశ్చిమ రైల్వే సబర్బన్ నెట్‌వర్క్‌లో 250 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో 150 నుండి 200 మిల్లీమీటర్ల వర్షం కురిసినప్పటికీ రైళ్ల రాకపోకలు కొనసాగాయని తెలిపారు.
“గత రాత్రి నుండి, ముఖ్యంగా ఈరోజు ఉదయం మరియు హైటైడ్ (సముద్రపు పోటు) ఉన్న సమయంలో భారీ వర్షం కురిసింది. పశ్చిమ రైల్వే సబర్బన్ విభాగంలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 250 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం చూశాము. అయితే ఇది మా రైలు సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మా లోకల్ మరియు దూరప్రాంత రైళ్ల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాయి” అని ఆయన చెప్పారు.
ఘాట్‌కోపర్‌లోని విక్రాంత్ సర్కిల్ ప్రాంతంలో తెల్లవారుజామున ఒక పెద్ద చెట్టు ఊడిపడటంతో ఒక కారు నుజ్జునుజ్జయింది. ఈ చెట్టు గురించి బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC)కి ముందే సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక స్థానికుడు తెలిపారు. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఏ అధికారి రాలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.

