పాన్ కార్డ్ (PAN Card) మరియు ఓటర్ ఐడీ (EPIC) వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు కేవలం ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిరూపించలేవని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) రికార్డులు, ఓటర్ల జాబితా, భూమి పత్రాలు, పాన్ కార్డ్ మరియు ఓటర్ ఐడీతో సహా ఏకంగా 15 పత్రాలను సమర్పించినప్పటికీ, గువహతికి చెందిన ‘అమీనుల్ హక్’ అనే వ్యక్తి తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడని కోర్టు పేర్కొంది.
ఫారిన్ యాక్ట్ (విదేశీయుల చట్టం) 1964 లోని సెక్షన్ 9 ప్రకారం… ఒక వ్యక్తి తాను విదేశీయుడిని కాదని, భారతీయ పౌరుడినని నిరూపించుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది. అమీనుల్ హక్ ఈ బాధ్యతను పూర్తి చేయలేకపోయాడని జస్టిస్ కళ్యాణ్ రాయ్ సురానా, జస్టిస్ షమీమా జహాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంటూ అతని పిటిషన్‌ను కొట్టివేసింది. తాను పుట్టుకతోనే భారతీయ పౌరుడినని పేర్కొంటూ, 2019లో ఫారినర్స్ ట్రిబ్యునల్ తనను విదేశీయుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హక్ హైకోర్టును ఆశ్రయించాడు.
మార్చి 24, 1971 కట్-ఆఫ్ తేదీ కంటే ముందే తన కుటుంబం అసోంలో ఉందని నిరూపించడానికి హక్ 1951 NRC రికార్డులు, 1966 నుండి ఓటర్ల జాబితాలు, 1973 నాటి భూమి విక్రయ పత్రం, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మరియు పాఠశాల రికార్డులను కోర్టుకు సమర్పించాడు. అయితే, ఈ పత్రాలను పరిశీలించిన హైకోర్టు కింద పేర్కొన్న లోపాలను ఎత్తిచూపింది:
తాను పేర్కొంటున్న పూర్వీకులకు, తనకు మధ్య ఉన్న సంబంధాన్ని (లింక్‌ను) స్పష్టమైన పత్రాల ద్వారా నిరూపించడంలో హక్ విఫలమయ్యాడు. హక్ తండ్రి స్వయంగా కోర్టుకు హాజరై ఇతను నా కుమారుడే అని వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, దానికి మద్దతుగా సరైన డాక్యుమెంట్లు లేనందున కేవలం మౌఖిక సాక్ష్యం సరిపోదని కోర్టు పేర్కొంది.డిజిటల్ రికార్డుల చెల్లుబాటు: 1951 NRC కి సంబంధించి అతను సమర్పించిన కంప్యూటర్ ఆధారిత రికార్డులు ఎలక్ట్రానిక్ రికార్డుల చట్టం ప్రకారం సరైన పద్ధతిలో ధృవీకరించబడలేదు.
వయస్సు, చిరునామాల్లో తేడాలు: వేర్వేరు గ్రామాల ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు ఒకే కుటుంబానికి చెందినవని నిరూపించడంలో అతను విఫలమయ్యాడు. అలాగే రికార్డులలో వయస్సు, కుటుంబ వివరాలు మరియు చిరునామాలలో స్పష్టత లేని తేడాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది.
బ్రహ్మపుత్రా నది కోత కారణంగా తమ భూములు మునిగిపోవడంతో కుటుంబం వేర్వేరు గ్రామాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని, అందువల్లే రికార్డులలో తేడాలు వచ్చాయని హక్ వివరణ ఇచ్చాడు. అయితే, నది కోత కారణంగానే వలస వెళ్లారనే దానికి ఎలాంటి స్వతంత్ర పత్రాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. చిన్నపాటి స్పెల్లింగ్ తప్పులను తాము పరిగణనలోకి తీసుకోనప్పటికీ, అసలు ఆయా రికార్డుల్లో ఉన్నది ఒకే కుటుంబమా కాదా అనేదానికి బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీ చేసే ఐడెంటిటీ కార్డులైన పాన్ కార్డ్, ఓటర్ ఐడీలు పౌరసత్వానికి అంతిమ రుజువు కాదని కోర్టు పునరుద్ఘాటించింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ హైకోర్టు హక్ పిటిషన్‌ను తిరస్కరించింది.

