పాకిస్థాన్ సైనిక చర్యల కారణంగా తమ దేశంలో 36 మంది పౌరులు మరణించారని ఆరోపించిన రెండు రోజులకే, ఆఫ్ఘనిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై తాము వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. పాకిస్థాన్ తన మునుపటి సైనిక చర్యను సమర్థించుకున్నప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్ తాజాగా జరిపిన ఈ ప్రతీకార దాడులపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనం వహించింది.
ఈ తాజా దాడులతో ఇరు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామని కాబూల్ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణలు, దౌత్యపరమైన నిరసనలు, మరియు విఫలమవుతున్న శాంతి చర్చల కారణంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఆందోళన నెలకొంది.
పాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ దాడులు
ఆఫ్ఘనిస్థాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆ దేశ వాయుసేన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతం, పషీన్ జిల్లాలోని ‘సరనాన్’ అనే ప్రాంతంలో ఉన్న దాఇష్ (ఐసిస్) ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ స్థావరాల నుంచే ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులకు వ్యూహాలు రచిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీనితో పాటు, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఐసిస్ అనుబంధ రహస్య స్థావరాలను కూడా ఆఫ్ఘన్ దళాలు విజయవంతంగా టార్గెట్ చేశాయి.
Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!
ఆదివారం రాత్రి పాకిస్థాన్ భద్రతా దళాలు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి జరిపిన దాడుల్లో భారీగా పౌర నష్టం వాటిల్లిందని కాబూల్ ఆరోపించింది. ఈ పాక్ దాడుల్లో కనీసం 36 మంది పౌరులు మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగానే తాము ఈ తాజా వైమానిక దాడులు చేసినట్లు ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది.
అయితే, తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోంది. పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ మాట్లాడుతూ.. దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఆదివారం రాత్రి సరిహద్దు వెంబడి భూతల దాడులు, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించామని, ఈ ఆపరేషన్‌లో 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఇరు దేశాల భిన్నమైన ప్రకటనలు సరిహద్దులో నెలకొన్న తీవ్ర వివాదాన్ని స్పష్టం చేస్తున్నాయి.

