డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను ఇవాల్టీ నుంచి సిట్ విచారించనుంది. కాసేపటి క్రితం దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ముందుకు హాజరయ్యారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆగస్టు 2 వరకూ రోజుకు ఒకరి చొప్పున విచారించనున్నారు. కెల్విన్ ఫోన్ విశ్లేషణలో లభించిన వివరాలు, విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి మత్తుమందులు సరఫరా చేసినట్లు వెల్లడైంది.
ఆబ్కారీశాఖ ప్రధాన కార్యాలయంలోని ఐదో అంతస్తును ఇందుకోసం సిద్ధం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. తమవద్ద ఉన్న వివరాల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృదం(సిట్) అధికారులు ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. ఇందులో విచారణకు హాజరయ్యేవారి వ్యక్తిగత వివరాలు మొదలు అనేక అంశాలు పొందుపరిచారు. విచారణ మొత్తం దీని ఆధారంగానే జరగబోతోంది.
మొత్తం 12 మందికి నోటీసులు పంపగా ముమైత్‌ఖాన్ తప్ప మిగతా వారందరూ తమకు అందినట్లు సమాధానం కూడా ఇచ్చారు. ముమైత్‌ఖాన్‌కు ఇప్పటికే వాట్సప్‌లో నోటీసులు పంపారు. తాజాగా వ్యక్తిగత చిరునామాకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు సినీ పరిశ్రమకు చెందిన వారిని విచారిస్తామని, తర్వాత మిగతా వారి వంతు వస్తుందని ఆబ్కారీశాఖ కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. విచారణకు పిలిచిన వారు రావాల్సిందేనని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.