బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించనున్న బయోపిక్ చిత్రం ‘కమల్ ఔర్ మీనా’ లో దిగ్గజ నటి మీనాకుమారి పాత్రలో కియారా అద్వానీ నటించబోతోందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ఈ వార్తలపై స్పందిస్తూ..సినిమాలో కియారా కాస్టింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమా అంతా ఖరారయ్యే (లాక్) వరకు ఏదీ ఫైనల్ కానట్లే. పరిశ్రమలో వ్యాపార సమీకరణాలు అలాగే ఉంటాయి. ఇక్కడ కేవలం నటీనటుల ఎంపిక మాత్రమే కాదు, సినిమాకు అయ్యే మొత్తం బడ్జెట్ (ఖర్చు) కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు.
ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహి, నటి మీనాకుమారిల నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. వారిద్దరూ చేతితో రాసుకున్న డైరీలు, సుమారు 2,000 ప్రేమ లేఖలను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులన్నీ పూర్తయ్యాయని, నటీనటుల ఎంపిక (కాస్టింగ్) పై కసరత్తులు చేస్తున్నామని ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!
దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రస్తుతం సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇక్కా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా 2026 జూలై 10న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ కానుంది. మరోవైపు, నటి కియారా అద్వానీ ప్రస్తుతం యష్, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం చివరకు 2026 ఆగస్టు 26న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.

