పాస్‌పోర్ట్..సిటిజన్ షిప్ కాదు!

3
- Advertisement -

పాస్‌పోర్ట్ జారీ మరియు పౌరసత్వానికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టతనిచ్చింది. భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగపడే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, దానిని పౌరసత్వానికి తుది నిరూపణగా పరిగణించలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో ద్వంద్వ పౌరసత్వం ,విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత కూడా భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటంపై తలెత్తిన కొన్ని వివాదాలు, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఏ భారతీయ పౌరుడైనా మరొక దేశ పౌరసత్వాన్ని పొందితే… అతను లేదా ఆమె భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.

ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడుతూ… ఒక వ్యక్తి వద్ద కేవలం భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన అతను భారత పౌరుడిగా చట్టబద్ధంగా కొనసాగుతున్నట్లు కాదు. ఒకవేళ సదరు వ్యక్తి భారత ప్రభుత్వానికి తెలియకుండా వేరే దేశ పౌరసత్వం తీసుకుని ఉంటే, ఈ పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాదు. ఎందుకంటే పాస్‌పోర్ట్ అనేది ప్రయాణాల కొరకు జారీ చేసే పత్రమే కానీ, అది పౌరసత్వాన్ని ధృవీకరించే శాశ్వత పత్రం కాదు అని స్పష్టం చేశారు.

Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత కూడా భారతీయ పాస్‌పోర్ట్‌ను దుర్వినియోగం చేయడం లేదా దానిని దాచిపెట్టడం చట్టరిత్యా నేరమని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. అటువంటి వారిపై పాస్‌పోర్ట్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని, భారీ జరిమానాలతో పాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించింది. విదేశీ పౌరసత్వం పొందిన భారతీయులు తమ పాస్‌పోర్ట్‌ను వెంటనే సరెండర్ చేసి ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ (OCI) కార్డ్ లేదా తగిన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -