అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడిన కొన్ని నెలలకే, రామాలయ నిధుల నిర్వహణ అత్యంత “అన్‌ప్రొఫెషనల్”గా ఉందంటూ ఒక ప్రైవేట్ ఆడిట్ సంస్థ హెచ్చరించింది. ఆలయ విరాళాలకు సంబంధించి ఎలాంటి “క్రమబద్ధమైన రికార్డులు” లేవని ఆ సంస్థ ఆరోపించింది. అయితే ఈ హెచ్చరికలు జారీ చేసిన ఆరేళ్ల తర్వాత కూడా మర్థవంతమైన నిర్వహణ కోసం ఆడిట్ సంస్థ సూచించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (SOP) అమలు కాలేదు. ప్రస్తుతం రామాలయ విరాళాల దుర్వినియోగంపై ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఈ నివేదిక బయటకు రావడం సంచలనం రేపుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నవంబర్ 2020లో ట్రస్ట్ అగ్ర ప్రతినిధి ఒకరు సదరు ఆడిట్ సంస్థను ‘ఇంటర్నల్ ఆడిట్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్’ పై సలహా ఇవ్వాల్సిందిగా కోరారు. ఆడిట్ సంస్థ ఆలయంలోని నిధుల నిర్వహణ, డేటా నిర్వహణ విధానాలను విశ్లేషించి, పలు లోపాలను ఎత్తిచూపింది.
ప్రతి లావాదేవీ, డేటా నిర్వహణ, సిబ్బంది మరియు ఇతర వనరుల బాధ్యతను, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ప్రతి స్థాయిలో ఒక ‘SOP’ రూపొందించాల్సిన అవసరం ఉందని నవంబర్ 2020 నివేదికలో సూచించింది. ఎగ్జిక్యూషన్ స్థాయిలో మేనేజ్‌మెంట్ యొక్క అధికారాలు, బాధ్యతలు స్పష్టంగా విభజించబడలేదని, దీనివల్ల సమాచారాన్ని నియంత్రించడం మరియు పారదర్శకతను కొనసాగించడం కష్టమని పేర్కొంది.
ఐటీ సేవలందిస్తున్న థర్డ్ పార్టీ సంస్థల డేటా ఎంట్రీని, డేటాబేస్‌ను పర్యవేక్షించడానికి లేదా ధృవీకరించడానికి అంతర్గతంగా ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేదని, ఇది సమాచార భద్రతకు ముప్పని హెచ్చరించింది. భక్తులు సమర్పించే నగదుతో పాటు బంగారం, వెండి వంటి ఆభరణాల నిర్వహణలో జరుగుతున్న గందరగోళాన్ని ఆడిట్ సంస్థ ముందే ఊహించింది. విలువైన వస్తువులు కానుకగా వచ్చినప్పుడు వాటిని నమోదు చేయడానికి ప్రాపర్ ‘స్టాక్ రిజిస్టర్’ నిర్వహించాలని, ‘ఇన్-కైండ్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ’ ఉండాలని స్పష్టం చేసింది.ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ… ఆడిట్ సంస్థ లేవనెత్తిన ఆందోళనలను ట్రస్ట్ యాజమాన్యం అప్పట్లోనే సరిదిద్ది ఉంటే ఇప్పుడు వచ్చిన ఈ నిందలు..ఈ గందరగోళం ఉండేవి కావు అని అభిప్రాయపడ్డారు.
Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫిబ్రవరి 5, 2020న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. అప్పటి నుండి కేవలం నగదు రూపంలోనే దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు అంచనా. ఇవి కాకుండా భారీగా బంగారు, వెండి వస్తువులు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నా…వేల మంది సిబ్బంది పనిచేస్తున్నా.. కనీసం ఒక ప్రాపర్ హెచ్ఆర్ (HR) విభాగాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ఆడిట్ నివేదిక తప్పుబట్టింది.

