మే 12న నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్ష రద్దయినప్పటి నుండి జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్ మధ్య ఉన్న నెల రోజులకు పైగా వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడిన కనీసం 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 12 మంది అభ్యర్థులు కూడా జూన్ 21న జరిగే రీ-టెస్ట్ రాయాల్సి ఉన్నవారే.
ఈ ఆత్మహత్యలన్నీ పరీక్ష రద్దుతోనే నేరుగా ముడిపడి ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేనప్పటికీ, పోలీసులు నమోదు చేసిన పంచనామాలో సదరు విద్యార్థుల కుటుంబ సభ్యులు పరీక్షలో మంచి మార్కులు సాధించాలనే విపరీతమైన ఒత్తిడి వల్లే ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఒకరు తన అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు బాల్కనీలో ఉన్న పావురాల నెట్‌ను కట్ చేసి కిందకు దూకాడు. పారామెడికల్ సిబ్బంది వచ్చే సమయానికే అతను మరణించాడు.
కోయంబత్తూరుకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని రీ-టెస్ట్ రాయడానికి కొన్ని రోజుల ముందు తన వాట్సాప్ మెసేజ్‌లో పరీక్ష గురించిన ఆందోళనను పంచుకుంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాసిన ఆమె…ఈసారి సీటు వస్తుందో లేదోనన్న సందిగ్ధంలో పడింది. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది అని బంధువులకు ఎమోషనల్ మెసేజ్ పంపి జూన్ 17న ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఇండోర్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడి 19 ఏళ్ల కుమార్తె కూడా ఇదే విధమైన భయాలతో భవనం పై అంతస్తు నుండి దూకి చికిత్స పొందుతూ మరణించింది.లక్నోలో రైల్వే అధికారి కుమార్తె అయిన ఒక విద్యార్థిని గత నీట్ పరీక్ష చాలా బాగా రాశానని ఇంట్లో చెప్పింది. కానీ పరీక్ష రద్దయినట్లు ప్రకటించడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి తన గదిలో శవమై కనిపించింది. గత ఏడాది కేవలం నాలుగు మార్కుల తేడాతో మెడికల్ సీటు కోల్పోయిన ఒక విద్యార్థిని ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మింది. అయితే మే 12న పరీక్ష రద్దవడంతో రెండు రోజుల తర్వాత ఆమె తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ALso Read:KTRను కలసిన TSEA ప్రతినిధులు
లాతూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలికకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఏకైక కల. మే 25న ఆమె గొండేగావ్ గ్రామంలో మృతిచెందింది. పరీక్ష రద్దయినప్పటి నుండి ఆమె తీవ్రమైన ఒత్తిడిలో ఉందని ఆమె తండ్రి పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

