పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) గత మూడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహుతో వ్యవహరించడం చాలా కష్టమైన పని అని…ఆయన ఒక ‘మొండి వ్యక్తి’ అని ట్రంప్ అభివర్ణించారు.
ట్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని చెప్పారు. అమెరికా అందిస్తున్న మద్దతుకు ఇజ్రాయెల్ కృతజ్ఞతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
దాదాపు మూడు నెలల క్రితం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై వరుస దాడులు ప్రారంభించాయి. ఇది పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధానికి దారితీయడమే కాకుండా, ప్రపంచ ఇంధన సంక్షోభానికి మరియు లెబనాన్‌కు ఈ వివాదం పాకడానికి కారణమైంది. మార్చి 2 నుండి అమెరికా-ఇరాన్ వివాదం లెబనాన్‌కు విస్తరించింది. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ‘హిజ్బుల్లా’.. ఇటీవల మరణించిన తమ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతికారం తీర్చుకోవడానికి ఈ యుద్ధంలో చేరింది.
ఆ తర్వాతి కొద్ది నెలల్లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. నెతన్యాహు దక్షిణ లెబనాన్‌లోకి సైనిక విస్తరణకు ఆదేశించడంతో దాదాపు పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇది అమెరికా – ఇరాన్ మధ్య జరగాల్సిన కాల్పుల విరమణ ప్రయత్నాలకు ఆటంకం కలిగించింది.
లెబనాన్‌లో కొనసాగుతున్న ఈ పోరాటం కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై మరిన్ని దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందంలో బీరూట్ (లెబనాన్ రాజధాని) ను కూడా చేర్చాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!
ప్రస్తుత శత్రుత్వానికి ముగింపు పలికేందుకు మరియు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి వాషింగ్టన్, టెహ్రాన్ (ఇరాన్) లు ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, లెబనాన్ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతోంది. లెబనాన్‌ను కూడా ఈ ఒప్పందంలో భాగం చేస్తామని పాకిస్థాన్ చెబుతుండగా ఇజ్రాయెల్ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించే హక్కు మాకుంది అని స్పష్టం చేస్తోంది.
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రాంతీయ సైనిక చర్యలను ముగించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ,అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి.

