మీనాక్షిపై టీకాంగ్రెస్ నాయకులే కుట్ర!

9
- Advertisement -

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఏమీ లేదని, ఇది పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పన్నిన లోపాయికారీ కుట్ర అని ఆయన ఆరోపించారు.

రాజ్యసభ స్థానంపై కన్నేసిన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులే లోపల ఉండి ఆమె అవకాశాలను దెబ్బతీశారని సీఎం మోహన్ యాదవ్ విమర్శించారు.భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, అసంతృప్తులే ఈ విపత్కర పరిస్థితికి కారణమని పేర్కొన్నారు.

రాజ్యసభ సీటు దక్కించుకోవాలని ఆశపడ్డ కొందరు కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వాన్ని సహించలేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌పై అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ కక్షతోనే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఆమె నామినేషన్ పత్రాల్లోని లోపాలను, తెలంగాణ కోర్టుకు సంబంధించిన కేసు వివరాలను బయటకు తీసి ప్రత్యర్థులకు చేరవేశారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లుగా కాంగ్రెస్ అంతర్గత నేతలే సమాచారాన్ని చేరవేసి ఈ నామినేషన్ తిరస్కరణకు కారణమయ్యారు అని సీఎం ఆరోపించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేక, వారిని క్రాస్ ఓటింగ్ నుంచి కాపాడుకోవడానికి బెంగళూరు తరలించాలని చూసిన ఉదంతాన్ని సీఎం మోహన్ యాదవ్ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో బెంగళూరు తరలించేందుకు చివరి నిమిషంలో భారీ ప్లాన్ సిద్ధమైంది. అయితే అనూహ్యంగా చార్టర్డ్ ఫ్లైట్ ఆలస్యం కావడం ఈ లోపు నామినేషన్ తిరస్కరణ ఉత్తర్వులు రావడం చకచకా జరిగిపోయాయి.

Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ

ఈ ఫ్లైట్ డిలే కావడం మరియు సమయానికి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అడ్డుకోవడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ పెద్దల హస్తం మరియు వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. సొంత అభ్యర్థిని ఓడించడానికి లేదా పోటీ నుంచి తప్పుకునేలా చేయడానికి ఇంతకంటే పెద్ద కుట్ర అవసరం లేదని ఆయన అన్నారు.

- Advertisement -