బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారత్ భాగ్య విధాత’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ముంబై నగరంపై జరిగిన ఒక ఘోరమైన ఉగ్రదాడి నేపథ్యంలో ఒకే రాత్రిలో 400కు పైగా ప్రాణాలను కాపాడేందుకు సాధారణ ప్రజలు చూపిన అసాధారణ ధైర్యసాహసాల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో కంగనా రనౌత్ ఒక నర్సు పాత్రను పోషించారు. దేశాన్ని రక్షించిన ప్రముఖ హీరోల కంటే.. క్లిష్ట సమయంలో నిశ్శబ్దంగా ప్రజల ప్రాణాలు కాపాడిన నర్సులు, వార్డ్ బాయ్‌ల త్యాగాలను ఈ చిత్రం వెలుగులోకి తెస్తోంది.
మొదట ఈ సినిమాకు ఈ టైటిల్ అనుకోలేదని ….ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు దీనికి ‘నర్స్ ఆఫ్ కామా’ (Nurses of Cama) అనే టైటిల్ ఉంది. కానీ కథ విన్నాక….ఇది భారతదేశం యొక్క సమిష్టి మానవత్వాన్ని ప్రతిబింబించేలా ఉందనిపించింది. అందుకే ఈ చిత్రానికి ‘భారత్ భాగ్య విధాత’ అనే పేరు పెడితే బాగుంటుందని అనుకున్నాం. అయితే అప్పటికే ఈ టైటిల్ హక్కులు స్టార్ హీరో జాన్ అబ్రహం వద్ద ఉన్నాయని మాకు తెలిసింది. సాధారణంగా ఇంత మంచి టైటిల్‌ను ఎవరూ అంత సులభంగా వదులుకోరు. కానీ నేను జాన్ సార్‌కి ఫోన్ చేసి అడగ్గానే ఆయన కేవలం ఒక్క రోజులోనే ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఈ టైటిల్‌ను మాకు ఇచ్చేశారు. ఆయనకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము అని కంగనా పేర్కొన్నారు.
ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ అంతా ఎక్కువగా ఒక హాస్పిటల్ (ఆసుపత్రి) నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. నగరం వెలుపల ఉగ్రవాదుల అలజడి సృష్టిస్తున్న వేళ.. ఆసుపత్రి లోపల నర్సులు, వార్డ్ బాయ్‌లు, క్లీనర్లు, సెక్యూరిటీ సిబ్బంది, లిఫ్ట్ ఆపరేటర్లు మరియు అడ్మినిస్ట్రేటర్లు భయపడకుండా తమ విధుల్లో ఎలా నిలబడ్డారనేది ఇందులో చూపించారు. వైద్య శిక్షణ ఇవ్వవచ్చు కానీ ధైర్యాన్ని నేర్పించలేమని, మానవత్వానికి సేవ చేయాలనే తపన లోపలి నుండి రావాలని కంగనా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

