ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలోని ఒక మంత్రికి కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) నాయకురాలు రబ్రీ దేవిపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భవన నిర్మాణ శాఖ సదరు బంగ్లాను డెయిరీ మరియు మత్స్య శాఖ మంత్రి నంద్ కిశోర్ రామ్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయనని చెప్పడానికి ఇదేమీ రాచరికం కాదు అంటూ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి….రబ్రీదేవిపై మండిపడ్డారు. అయితే ఈ విషయంపై మాట్లాడేటప్పుడు చౌదరి ప్రతిపక్ష పార్టీ పేరు గానీ….నాయకుల పేర్లు గానీ నేరుగా ప్రస్తావించలేదు. కొందరు ఒక బంగ్లాను తమకు దక్కిన వారసత్వ ఆస్తి లాగా భావిస్తారు. తల్లికి ఒక ఇల్లు…కొడుకుకు మరొక ఇల్లు కావాలి…. ఇది రాచరికం కాదు అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాబ్రీ దేవి ’10 సర్క్యులర్ రోడ్’ బంగ్లాలోనే నివసిస్తున్నారు. రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకురాలిగా ఆమెకు కేటాయించిన ’39, హార్డింజ్ రోడ్’ నివాసానికి మారడానికి ఆమె నిరాకరించారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆమె కుమారుడు తేజస్వీ యాదవ్ ‘1 పోలో రోడ్’ లో నివసిస్తున్నారు.
దీనిపై రబ్రీ దేవి తీవ్రంగా స్పందించారు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నట్లు నాకు కనిపిస్తోంది…. ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగానైనా ఖాళీ చేయించుకోనివ్వండి.. నేనైతే ఈ ఇల్లు ఖాళీ చేయను అని ఆమె తెగేసి చెప్పారు.1997లో తన భర్త (లాలూ ప్రసాద్ యాదవ్) తర్వాత ఆమె బీహార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తన భర్తతో కలిసి ఈ బంగ్లాలోనే నివసిస్తున్నారు.
ALso Read:తెలంగాణను కాపాడుకుందాం!

