LUCC:రూ. 800 కోట్ల లూక్ స్కామ్!

1
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో జరిగిన రూ. 800 కోట్ల ‘లూక్’ (LUCC) చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన సూత్రధారులను ముంబైలో అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ’ (LUCC) ఆకర్షణీయమైన రాబడులు ఇస్తామంటూ నమ్మించి సుమారు లక్ష మందికి పైగా ఇన్వెస్టర్లను రూ. 800 కోట్ల మేర ముంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసులు 18 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేయడంతో.. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కిషన్ జైన్, పంకజ్ జైన్ ఇద్దరూ పరారయ్యారు. గత ఏడాది నవంబర్‌లో ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ కేసులను సీబీఐకి అప్పగించింది.

అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్న సీబీఐ బృందం.. సోమవారం వారిని ముంబైలో అరెస్ట్ చేసింది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో భారీ సంఖ్యలో డిపాజిటర్లను ప్రభావితం చేస్తూ.. చట్టవిరుద్ధంగా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించడం, మోసం, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర, నియంత్రణ లేని డిపాజిట్ స్కీమ్‌లను నడపడం మరియు నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వంటి ఆరోపణలు ‘లూక్’ సంస్థపై ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది.

ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ప్రజలు బాధితులుగా మారినట్లు తేలింది. లూక్ సంస్థ నడిపిన వివిధ అనధికారిక డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టేలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లను ఆకర్షించారు అని వెల్లడించారు. ఈ కేసులో కిషన్ జైన్, పంకజ్ జైన్ లు ప్రాథమిక నిందితులుగా ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.

ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్ని, లూక్ ద్వారా సేకరించిన నిధులను హ్యాండిల్ చేయడంలో, వాటిని ఇతర మార్గాలకు మళ్లించడంలో మరియు దుర్వినియోగం చేయడంలో వీరు చురుకైన, కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలిపింది.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

- Advertisement -