వచ్చే ఐదేళ్లలో ఎండలు..ఊహించలేరు!

4
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఎండ తీవ్రతను చూసి జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (UNO) మరింత ఆందోళనకరమైన హెచ్చరికను జారీ చేసింది. ఇప్పుడున్న వేడి కేవలం ఆరంభం మాత్రమేనని….రాబోయే ఐదేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది.

వాతావరణ మార్పులపై డబ్ల్యూఎమ్ఓ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోవడం మరియు సహజంగా సంభవించే ‘ఎల్ నినో’ (El Nino) వాతావరణ పరిస్థితి తోడవ్వడమే దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక్క సంవత్సరమైనా చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 98 శాతంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. గ్లోబల్ వార్మింగ్ సగటు పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటిపోయే ప్రమాదం ఇప్పట్లో 66 శాతానికి పైగా ఉందని నివేదిక హెచ్చరించింది. పారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఇది గొడ్డలిపెట్టు లాంటిదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి లభ్యత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో వేడి మరింత వేగంగా పెరుగుతుందని, దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఉద్గారాల తగ్గింపుపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మానవాళి మరింత ఘోరమైన వాతావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదిక హెచ్చరించింది.

- Advertisement -