ఐపీఎల్..అక్టోబర్‌కు మారనుందా?

4
- Advertisement -

ఐపీఎల్‌లో జట్ల సంఖ్య 10కి పెరిగినప్పటి నుండి లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర అన్ని జట్లతో రెండేసి సార్లు తలపడే పాత విధానం సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ టోర్నమెంట్‌ను రెండు విడతలుగా నిర్వహించడాన్ని పరిశీలిస్తోంది. అందులో ఒక విడతను సెప్టెంబర్-అక్టోబర్ కాలానికి మార్చే యోచనలో ఉంది.

ఐపీఎల్‌ను రెండు విండోలుగా విభజించి, ఒక భాగాన్ని సెప్టెంబర్-అక్టోబర్ నెలలకు మార్చే అవకాశం ఉందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ‘స్పోర్ట్‌స్టార్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం ఒక సీజన్‌లో జరుగుతున్న 74 మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ భావిస్తోంది. దీనివల్ల 2022 నుండి అమలులో ఉన్న గ్రూప్ విధానానికి భిన్నంగా, ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో రెండేసి సార్లు ఆడే అవకాశం లభిస్తుంది.

2022 సీజన్ నుండి జట్లను రెండు వర్చువల్ గ్రూపులుగా విభజించారు. దీనివల్ల ప్రతి జట్టు ఐదు జట్లతో రెండేసి సార్లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కోసారి మాత్రమే ఆడుతోంది. అయితే, 2028 నుండి లీగ్‌ను మరింత విస్తరించి జట్లన్నీ పరస్పరం రెండేసి సార్లు తలపడేలా చేయాలని చూస్తున్నారు. దీనివల్ల మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 94కి చేరుతుంది.

ప్రస్తుతం ప్రతి జట్టుకు 7 హోమ్ మ్యాచ్‌లు.. 7 అవే మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. 10 జట్ల ఫార్మాట్‌లో ప్రతి జట్టుకు 9 హోమ్, 9 అవే మ్యాచ్‌లు ఉండాలి కానీ ప్రయాణ లాజిస్టిక్స్ సవాళ్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందాల కారణంగా మేము ఇప్పటివరకు అలా చేయలేకపోయాము..భవిష్యత్తులో ఐపీఎల్ కోసం మరో రెండు వారాల అదనపు సమయం దొరికితే మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కి పెంచే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అని ధుమాల్ పేర్కొన్నారు.

Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!

రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఐపీఎల్ వల్ల ప్రేక్షకులలో ఎలాంటి అలసట రావడం లేదని ధుమాల్ అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్‌లోని రెండో విడతను సెప్టెంబర్-అక్టోబర్ కాలానికి మార్చడంపై బ్రాడ్‌కాస్టర్ల (ప్రసారదారులు) అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ సమయంలో దీపావళి పండుగ వస్తుండటంతో ప్రకటనకర్తలకు అది అత్యుత్తమ సమయమని చాలామంది సూచించారని ఆయన తెలిపారు. తదుపరి మీడియా హక్కుల టెండర్ సమయంలో ఈ విండోను వెతకడానికి ప్రయత్నిస్తామన్నారు. ఐపీఎల్ నిర్ణయాలు కేవలం బీసీసీఐ పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి మిగిలిన దేశాల బోర్డులతో కలిసి చర్చించి, అందరికీ అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకుంటాం అని ధుమాల్ తెలిపారు.

- Advertisement -