సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) ఆకస్మిక మృతి ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇవాళ ఉదయం లక్నోలో ఆయన కన్నుమూశారు.
లక్నోలోని తన నివాసంలో ప్రతీక్ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించినట్లు సమాచారం. ఉదయం 5 గంటల సమయంలో అత్యవసర సమాచారం అందుకున్న వైద్య బృందం ఆయన నివాసానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆయనను లక్నో సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే ఆయన మరణించారని, ఉదయం 5:55 గంటలకు వైద్యులు మృతిని ధృవీకరించారు.
ప్రతీక్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్త కుమారుడు. యూపీ మాజీ సీఎం, సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ప్రతీక్ సవతి సోదరుడు.అఖిలేష్ యాదవ్ లాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.ప్రతీక్ లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి చదువు పూర్తి చేసి, రియల్ ఎస్టేట్ మరియు ఫిట్నెస్ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
ఆయన భార్య అపర్ణ యాదవ్ ప్రస్తుతం బీజేపీ నేతగా, ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.ప్రతీక్ యాదవ్ మరణానికి ముందు ఆయన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఇటీవల ప్రతీక్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అపర్ణ యాదవ్‌తో విడిపోతున్నట్లు సంచలన పోస్ట్‌లు చేశారు. ఆమెను “స్వార్థపరురాలు” అని, కుటుంబ బంధాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు.
అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే “అంతా బాగానే ఉంది (All is good)” అని మరో పోస్ట్ పెట్టడం గందరగోళానికి దారితీసింది. ఆ పోస్ట్‌లు ఆయనే పెట్టారా లేక ఆయన ఖాతా హ్యాక్ అయిందా అనే దానిపై స్పష్టత లేదు. ములాయం కుటుంబంలో జరిగిన ఈ విషాదంతో అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read:సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్!

