తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత జాగీరులా మారిందని, ఆయన ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవన్ రెడ్డి తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పాలనా విధానాన్ని, పార్టీ నిర్వహణను తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీలా లేదు.. అది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది” అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం పట్టు కోల్పోయిందని, ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు.
ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను జీవన్ రెడ్డి ఆకాశానికెత్తడం విశేషం. రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వివరించారు.”కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు.. నన్ను ఎప్పుడూ ‘అన్న’ అని గౌరవంగా పిలుస్తారు. ఆయనకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా గౌరవం ఉంది. నీలాగా అహంకారం లేదు రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, అది తన ప్రాంత ప్రజల ఆకాంక్ష అన్నారు.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

