ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో మరో అరంగేట్ర బౌలర్ ప్రాఫుల్ హింగేతో పాటు సాకిబ్ హుస్సేన్ కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
మొదటి ఓవర్‌లోనే ప్రాఫుల్ హింగే సంచలనం సృష్టించగా, సాకిబ్ హుస్సేన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 7వ ఆటగాడిగా సాకిబ్ రికార్డు సృష్టించాడు.
సాకిబ్ హుస్సేన్ స్వస్థలం బీహార్. ఐపీఎల్ 2026 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇతడిని ₹30 లక్షలకు కొనుగోలు చేసింది. 2022-23 సీజన్‌లో కేవలం 17 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ20 అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 4/20 గణాంకాలతో ఆకట్టుకున్నాడు.
2025-26 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 41 పరుగులకే 6 వికెట్లు తీసి తన తొలి ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజంటేషన్ వేడుకలో సాకిబ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రతి ఆటగాడు ఇలాంటి అరంగేట్రం కావాలని కలలు కంటాడు. ఈ ప్రదర్శన చాలా సంతోషాన్ని ఇస్తోంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే నేను తుది జట్టులో ఉన్నానని మా బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ చెప్పారు. ఎస్‌ఆర్‌హెచ్ స్కౌట్స్ గుర్తించిన ఈ యువ ప్రతిభ, తన మొదటి మ్యాచ్‌తోనే లీగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించి, రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమిని రుచి చూపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!

