ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచే నోయిడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు తొలి దశ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు తెలిపారు. జేవర్ ఎయిర్‌పోర్ట్‌ను “ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి రన్‌వే”గా అభివర్ణించారు.
మార్చి 28న ఈ ఎయిర్పోర్ట్ తొలి దశను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని ఆయన కొనియాడారు.
యూపీ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతోందని, ఈ ఎయిర్పోర్ట్ ద్వారా యువతకు అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని యోగి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ఇది కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!
మొదటి దశలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్, భవిష్యత్తులో ఉత్తర భారతదేశానికి ప్రధాన విమానయాన హబ్‌గా అభివృద్ధి చెందనుంది.సీఎం యోగి మాట్లాడుతూ, “ఈ ఎయిర్పోర్ట్ నుంచి యువత కలలు ఎగరనున్నాయి, అవకాశాలు నిజం కానున్నాయి” అని పేర్కొన్నారు.మొత్తానికి, జేవర్ ఎయిర్పోర్ట్ ప్రారంభం యూపీకి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.

