జమ్ముకశ్మీర్లో భారీ విషాదం చోటుచేసుకుంది. జోజిలా పాస్ వద్ద భారీ మంచు చరియలు విరిగిపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మంచు తుఫాను తీవ్రతకు సుమారు 15 వాహనాలు మంచు కింద చిక్కుకున్నాయి. జమ్ము కశ్మీర్లోని కీలక మార్గమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంచు గుట్టలు పెద్దఎత్తున రహదారిపై పడటంతో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
ఘటన అనంతరం వెంటనే రంగంలోకి దిగిన రెస్య్కూ సిబ్బంది.. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. మంచు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేక పరికరాలతో గాలింపు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, రక్షణ చర్యలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
జోజిలా పాస్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో మంచు తుఫానులు సాధారణమే అయినప్పటికీ, ఇటువంటి భారీ ప్రమాదాలు తరచుగా ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!

