తెలంగాణలో పలువురు మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. మావోయిస్టు అగ్రనేత కట్ట రామచంద్రరెడ్డి అలియాస్ విఠల్ మరణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
కట్టా రాంచంద్రారెడ్డి అక్టోబర్ 19, 2025న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తీగలగుంటపల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పలువురు మాజీ మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో హుజురాబాద్ మరియు భీందేవరపల్లి మండలాలకు చెందిన కొంతమంది మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 4/25 కేసు దర్యాప్తులో భాగంగా వారికి తెలిసిన వివరాలను సేకరించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
నోటీసుల ప్రకారం, ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరై విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 15లోపు తమకు సంబంధించిన స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరై వివరాలు నమోదు చేయాలని కూడా ఆదేశించారు.
ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ మావోయిస్టులతో పాటు ఈ ఘటనకు సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.


