తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. దేవుడే నన్ను కాపాడాడు అని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లాను కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తి లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన బయటకు వస్తుండగా వెనుక నుంచి కాల్పులు జరపడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ…నేను బాగానే ఉన్నాను. దేవుడే నన్ను రక్షించాడు. ఆ వ్యక్తి నా మెడ వెనుక భాగానికి దగ్గరగా వచ్చాడు. చివరి క్షణంలో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నన్ను కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు అని చెప్పారు.
ఈ ఘటనలో నిందితుడిని కమల్ సింగ్ జమ్వాల్‌గా గుర్తించారు. Z+ భద్రత కలిగిన నాయకుడిపై ఇలాంటి దాడి ప్రయత్నం జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ…లోడెడ్ పిస్టల్‌తో ఒక వ్యక్తి ఇంత దగ్గరకు రావడం ఎలా సాధ్యమైందో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాల్పు జరిగినప్పటికీ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి దాడిని అడ్డుకున్నారని చెప్పారు. ఈ ఘటన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర భద్రత కలిగిన అన్ని ప్రముఖుల భద్రతను అధికారులు సమీక్షిస్తున్నారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!

