ఉత్తర అమెరికాలోని ప్రసిద్ధ నయాగరా జలపాతం అరుదైన దృశ్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. తీవ్ర చలితో నయాగరా జలపాతం పాక్షికంగా గడ్డకట్టి, మంచుతో కప్పబడి అద్భుతమైన మంచు లోకంగా దర్శనమిస్తోంది. సాధారణంగా ఉప్పొంగుతూ ప్రవహించే నీరు, ఇప్పుడు మంచు శిల్పాల్లా మారి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
నిపుణుల సమాచారం ప్రకారం, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న బలమైన శీతల గాలులే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఉత్తర అమెరికా అంతటా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో, నయాగరా ప్రాంతంలో కూడా తీవ్ర చలి నెలకొంది. దీంతో జలపాతం చుట్టూ నీటి చిమ్ముర్లు గడ్డకట్టి, భారీ మంచు పొరలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా, ఉత్తర ధృవం వద్ద శీతల గాలిని బంధించి ఉంచే ‘పోలార్ వోర్టెక్స్’ వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత వల్ల ఈ చలి తరంగాలు దక్షిణ దిశగా విస్తరించినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రభావంతో కెనడా, అమెరికా ప్రాంతాల్లో అసాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also Read:న్యాయవాదిగా మారిన సీఎం మమతా
నయాగరా జలపాతం పూర్తిగా గడ్డకట్టకపోయినా, పాక్షికంగా మంచుతో కప్పబడటం అరుదైన పరిణామమే. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటుండగా, అధికారులు మాత్రం తీవ్ర చలి కారణంగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ప్రకృతి చూపిన ఈ అరుదైన అబ్బురం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

