మహారాష్ట్రలోని మీరా–భాయందర్ మునిసిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా బీజేపీ కౌన్సిలర్ డింపల్ మెహతా ఎన్నికయ్యారు. అయితే ఆమె ఎన్నికపై మరాఠీ సంస్థలు తీవ్ర నిరసనలకు దిగాయి. మేయర్ పదవిని తప్పనిసరిగా మరాఠీ మాట్లాడే వ్యక్తికే ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్ డింపల్ మెహతా మీరా–భాయందర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్), మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్)లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మేయర్ పదవికి మరాఠీ భాష తెలిసిన నాయకుడినే నియమించాలని ఈ సంఘాలు పట్టుబడుతున్నాయి.
మీరా–భాయందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 95 మంది కార్పొరేటర్లు ఉండగా, వీరిలో బీజేపీకి 78 మంది సభ్యులతో భారీ ఆధిక్యం ఉంది. కాంగ్రెస్‌కు 13 మంది, శివసేన (షిండే వర్గం)కు 3 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదనంగా, ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి కూడా విజయం సాధించారు. ముఖ్యంగా ఆ రెబల్ కార్పొరేటర్ అనిల్ పాటిల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించడం గమనార్హం.
Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’
మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి కాంగ్రెస్, శివసేన (షిండే వర్గం) కలిసి సంయుక్తంగా పోటీ చేశాయి. బీజేపీ తరఫున సీనియర్ నాయకుడు నరేంద్ర మెహతా సోదరి కోడలు అయిన డింపల్ మెహతాను అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్–శివసేన కూటమి రుబినా ఖతూన్‌ను మేయర్ పదవికి అభ్యర్థిగా ప్రకటించింది.

