ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టారు. మాటలకంటే సంస్కరణల మార్గాన్నే ప్రభుత్వం ఎంచుకుందని ఆమె స్పష్టం చేశారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
బడ్జెట్లో భాగంగా స్వయం ఆధార భారత్ ఫండ్‌కు రూ.4,000 కోట్ల అదనపు నిధులు ప్రతిపాదించారు. అలాగే 200 లెగసీ పారిశ్రామిక క్లస్టర్ల పునరుజ్జీవనం, దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు మూడు ప్రత్యేక కెమికల్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఐదు భాగాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్రోగ్రాం కూడా ప్రకటించారు.
వృద్ధి ఫలాలు ప్రతి రైతు, ఎస్సీ, ఎస్టీ, యువత వరకు చేరేలా చూస్తామని చెప్పారు. జీఎస్టీ, లేబర్ కోడ్స్, క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ వంటి అనేక సంస్కరణలు అమల్లో ఉన్నాయని, “రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ముందుకు సాగుతోంది” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కర్తవ్యం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి కొనసాగించడమని, పేదలు, వెనుకబడిన వర్గాలపై దృష్టి పెట్టడమని తెలిపారు.
ఎంఎస్ఎంఈల కోసం సీపీఎస్ఈల కొనుగోళ్లన్నీ TReDS ప్లాట్‌ఫాంల ద్వారా జరగాలని ప్రతిపాదించారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏడు వ్యూహాత్మక రంగాల్లో స్కేలింగ్, ఇన్ఫ్రాకు ఊతం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటి ఆరు కీలక చర్యలు సూచించారు.
బయోఫార్మా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడి, మూడు కొత్త నైపర్లు, ఏడు ఉన్నవాటి అప్‌గ్రేడ్, 1,000 క్లినికల్ ట్రయల్ సైట్ల నెట్వర్క్, CDSCO బలోపేతం ప్రకటించారు. మెగా టెక్స్టైల్ పార్కులు, ISM 2.0, కంటైనర్ తయారీకి ప్రత్యేక పథకం కూడా ఉన్నాయి.
ఇది వరుసగా నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక ప్రయాణం స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రిత ద్రవ్యోల్బణంతో కొనసాగుతోందని ఆమె తెలిపారు.
Also Read:కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన

