చిరంజీవి వ్యాఖ్యల్ని ఖండించిన చిన్మయి

6
- Advertisement -

సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్ అంశంపై ప్రముఖ సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆమె బహిరంగంగా విభేదిస్తూ, ఫిలిం ఇండస్ట్రీ అద్దంలాంటిదని, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదన్న మాటలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలో జరుగుతున్న వాస్తవాలు బయటకు కనిపించేవాటికి భిన్నంగా ఉంటాయని చిన్మయి స్పష్టం చేశారు.

ఫిలిం ఇండస్ట్రీలో “కమిట్మెంట్” అనే పదానికి పూర్తిగా వేరే అర్థం ఉందని, చాలాసార్లు అది ప్రతిభకు సంబంధం లేకుండా వక్రీకరించబడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావు అనే అనైతిక ఆలోచన ఇప్పటికీ కొనసాగుతోందని, ఇదే అనేక మంది మహిళల కెరీర్‌లను దెబ్బతీస్తోందని అన్నారు.

గతంలో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చిన్మయి వ్యాఖ్యానించారు. గతంలో ఒక ప్రముఖ సింగర్ మహిళలను లైంగికంగా వేధించాడని, అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారికే మళ్లీ రెడ్ కార్పెట్ వేస్తున్నారని విమర్శించారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అశ్విని రాజ్‌కుమార్‌

ఇలాంటి విషయాలపై నోరు విప్పితేనే మార్పు వస్తుందని, బాధితుల గొంతుకకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చిన్మయి పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత, గౌరవం కల్పించాలంటే నిజాలను అంగీకరించి, బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -