ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తాం కాబట్టే అధికారులు సూచించిన సమయానికి విచారణకు హాజరవుతున్నామని స్పష్టం చేశారు. విచారణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నా, తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం అటెన్షన్ కోసం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా మాత్రమేనని ఆరోపించారు. ఇంకా ఎన్నిసార్లు పిలిచినా, ఎక్కడికి పిలిచినా విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నేపథ్యంలో, లీగల్ టీమ్‌తో కలిసి విచారణలో ఏ అంశాలపై మాట్లాడాలి, ఎలా స్పందించాలి అనే విషయాలపై కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరిపినట్లు సమాచారం. పరిస్థితిని సమీక్షిస్తూ న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా సంప్రదింపులు నిర్వహించారు.
మరోవైపు హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ALso Read:వరుణ్..’కోరియన్ కనకరాజు’ గ్లింప్స్

