బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ తరపున 37 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం ఉండనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
నితిన్ నబిన్ 23 మే 1980న జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా సీనియర్ బీజేపీ నేత. పట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు బిహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నితిన్ నబిన్ పట్నాలోని సెయింట్ మైకేల్ హై స్కూల్‌లో చదువుకున్నారు. అక్కడి నుంచి 1996లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షను పూర్తి చేశారు. అనంతరం న్యూఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్‌లో సీనియర్ సెకండరీ విద్యను అభ్యసించి, 1998లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయన దీప్మాలా శ్రీవాస్తవను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే ముందు నితిన్ నబిన్ ఐదుసార్లు బిహార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాంకీపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిని 51 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు.
2025 బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, నితిన్ నబిన్ మొత్తం ఆస్తుల విలువ రూ.3.08 కోట్లు. ఇందులో చర ఆస్తులు రూ.1.60 కోట్లు, స్థిర ఆస్తులు రూ.1.47 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆయనపై రూ.56.6 లక్షల బాద్యతలు (లయబిలిటీస్) ఉన్నట్లు వెల్లడించారు.
బీజేపీ పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం, కేడర్ యాక్టివిజాన్ని మెరుగుపరచడం, రాజకీయ సందేశాన్ని మరింత పదును పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కలిగిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ, కొంతమంది బయట నాయకులకూ అవకాశం ఇవ్వవచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read:జగిత్యాల కాంగ్రెస్‌లో ఆరని మంట!

