అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర నిరసనల మధ్య ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీపై ఎలాంటి దాడి జరిగినా అది సంపూర్ణ యుద్ధానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, దేశంలో కొనసాగుతున్న అల్లర్లలో కనీసం 5,000 మంది మరణించినట్లు ఒక ఇరానియన్ అధికారి వెల్లడించగా, పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అవసరమైతే ఉరిశిక్షలను మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా ఇరాన్ సూచించింది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ, “అన్యాయమైన ఎలాంటి దాడికైనా ఇరాన్ ప్రతిస్పందన కఠినంగా, పశ్చాత్తాపకరంగా ఉంటుంది. దేశ సుప్రీం లీడర్‌పై దాడి చేయడం అంటే ఇరాన్‌పై సంపూర్ణ యుద్ధం ప్రకటించినట్టే” అని హెచ్చరించారు. అలాగే ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాల దీర్ఘకాల శత్రుత్వం, అమానుష ఆంక్షలే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే పెజెష్కియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై దమనకాండ కొనసాగితే అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. శనివారం ‘పాలిటికో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్…ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది అన్నారు.
ఇరాన్ నాయకత్వం హింస, అణచివేత ద్వారా అధికారాన్ని నిలబెట్టుకుంటోందని ట్రంప్ విమర్శించారు. “దేశాన్ని నడపాల్సిన నాయకుడు, ప్రజలను వేల సంఖ్యలో చంపుతూ నియంత్రణలో ఉంచడం కాకుండా, సరైన పాలనపై దృష్టి పెట్టాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.అయితే, శుక్రవారం రోజున 800 మందికి పైగా ఉరిశిక్షలను నిలిపివేయాలన్న ఇరాన్ నిర్ణయాన్ని ట్రంప్ అనూహ్యంగా ప్రశంసించారు. ఇది ఉద్రిక్తతలు కొంత తగ్గే సూచనగా భావిస్తున్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోకు వెళ్లే ముందు వైట్ హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ నిర్ణయానికి “గొప్ప గౌరవం” వ్యక్తం చేస్తూ, దీని వల్ల పెద్ద ప్రభావం పడిందన్నారు.
డిసెంబరులో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కనీసం 5,000 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని ఒక సీనియర్ ఇరానియన్ అధికారి తెలిపారు. వాయువ్య ఇరాన్‌లోని కుర్దిష్ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయని, కుర్దిష్ వేర్పాటువాదులు–ప్రభుత్వ బలగాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు.
Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?
సుప్రీం లీడర్ ఖామెనీ ఈ అల్లర్లకు పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికానే కారణమని ఆరోపించారు. శనివారం ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అమెరికా “ఫుట్ సోల్జర్లు” నిరసనల్లో పాల్గొని మసీదులు, విద్యాసంస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్ ప్రజలపై చేసిన ఆరోపణలు, జరిగిన ప్రాణనష్టం, నష్టాలకు అమెరికా అధ్యక్షుడే బాధ్యుడు. అందుకే మేము ఆయనను నేరస్తుడిగా భావిస్తున్నాం అని ఖామెనీ పేర్కొన్నారు.

