నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై జరుగుతున్న విచారణ సమయంలో తానే స్వయంగా కోర్టులో హాజరయ్యానని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక నిబంధనలు ఉల్లంఘించిందన్న విషయాన్ని న్యాయస్థానం ముందు వివరించినట్లు చెప్పారు. అవసరమైన అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించారని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు ఇచ్చిందని ఉత్తమ్ తెలిపారు. రిట్ పిటిషన్ కంటే సివిల్ సూట్ రూపంలో రావాలని కోర్టు సూచించిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం అన్ని న్యాయ, పరిపాలనా మార్గాలను అనుసరిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టులో నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారంపై సివిల్ సూట్ ఫైల్ చేస్తామని కోర్టుకు తెలిపింది. గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలు కూడా వినాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హత కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు, నీటి హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.
Also Read:‘మన శంకర వరప్రసాద్ గారు’..రివ్యూ

