సంక్రాంతి సంబరాలు..కాలువలో పడ్డ కలెక్టర్

8
- Advertisement -

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద నిర్వహించిన సంప్రదాయ పడవ పోటీల ట్రైల్ రన్‌లో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పర్యాటకులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

పోటీల ప్రారంభ సూచనగా కలెక్టర్ మహేశ్ కుమార్ స్వయంగా పడవలో ప్రయాణిస్తూ ట్రైల్ రన్‌ను ప్రారంభించారు. అయితే పడవ అకస్మాత్తుగా అదుపు తప్పడంతో ఆయన సమతుల్యం కోల్పోయి నీటిలో పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న అధికారులు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ముందుగానే మోహరించిన అనుభవజ్ఞులైన స్విమ్మర్లు వెంటనే స్పందించారు. క్షణాల్లోనే కలెక్టర్‌ను సురక్షితంగా నీటిలోంచి బయటకు తీసి మరో పడవలోకి ఎక్కించారు.

ఈ ఘటనలో కలెక్టర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. కొద్దిసేపు కార్యక్రమం నిలిపివేసినప్పటికీ, పరిస్థితి సాధారణంగా మారడంతో పడవ పోటీలను తిరిగి కొనసాగించారు. ఈ సంఘటనతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల సమయంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

- Advertisement -