Cyberabad:రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు

4
- Advertisement -

ఈ ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రికార్డు స్థాయిలో చలాన్లు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరంలో దాదాపు 36 లక్షల వాహనాలపై మొత్తం రూ.239.37 కోట్ల విలువైన ట్రాఫిక్ చలాన్లు జారీ చేసినట్లు పోలీస్ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.111.81 కోట్ల చలాన్లు మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది అది రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం గమనార్హం.

అధికారుల వివరాల ప్రకారం, ఈ ఏడాది అత్యధికంగా రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అలాగే సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ఉల్లంఘనలు తగ్గడం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు.

అయితే క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణకు సరిపడా పోలీస్ సిబ్బంది లేకపోవడం మరో సవాలుగా మారిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రైవేట్ మార్షల్స్‌ను నియమించి, ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి సహకరిస్తేనే ప్రమాదాలు, చలాన్ల సంఖ్య తగ్గుతాయని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read:వైభవ్‌పై భారత మాజీ క్రికెటర్ ప్రశంసలు

- Advertisement -