కట్నం చట్టపరంగా నిషేధించబడినప్పటికీ, ఈ దురాచారం సమాజంలో ఇంకా విస్తృతంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అజ్మల్ బేగ్ కేసులో సోమవారం ఇచ్చిన కఠిన పదజాలంతో కూడిన తీర్పులో, బహుమతుల పేరుతో కట్నం వ్యవస్థ కొనసాగుతోందని, ఇది వివాహ జీవితం లో మహిళల వేధింపులు, క్రూరత్వం, మరణాలకు కారణమవుతోందని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం, కట్నాన్ని నిషేధించేందుకు చట్టం ఉన్నప్పటికీ, సామాజిక అంచనాలు, ఆచారాల ముసుగులో అది ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కట్నం మహిళలపై జరిగే వేధింపులు, హింస, కట్న మరణాలతో నేరుగా సంబంధం కలిగి ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో కట్న వేధింపులు, కట్న మరణాలకు సంబంధించిన కేసుల్లో అవగాహన, చట్ట అమలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, అధికారులకు సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కట్నం వంటి సమస్యలను సామాజిక స్థాయిలో ఎదుర్కొనేందుకు విద్యా పాఠ్యాంశాల్లో సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
కట్న నిషేధ అధికారుల సరైన నియామకం, అధికారాల కల్పన, ప్రజల్లో వారికి గుర్తింపు పెంచడం.
కట్న సంబంధిత కేసుల సామాజిక, మానసిక కోణాలపై పోలీస్ అధికారులు, న్యాయ అధికారులకు తరచుగా శిక్షణ ఇవ్వడం.
ఐపీసీ సెక్షన్ 304బి (కట్న మరణం), 498ఏ (భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం) కింద పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టులు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించడం.
అధికారిక విద్యకు దూరంగా ఉన్న వర్గాల కోసం ప్రత్యేకంగా జిల్లా పరిపాలనలు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
ఈ కేసు యూపీ రాష్ట్రం దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లకు సంబంధించినది. ఏడాదికి కొద్దిగా మించి వివాహ జీవితం గడిపిన 20 ఏళ్ల యువతిని కలర్ టీవీ, మోటార్‌సైకిల్, రూ.15,000 నగదు కట్నంగా డిమాండ్ చేస్తూ తరచూ వేధించడంతో ఆమె మృతి చెందిన ఘటనపై ఈ అప్పీళ్లు వచ్చాయి.
ఈ కేసులో ట్రయల్ కోర్టు భర్త అజ్మల్ బేగ్, అతని తల్లి జమీల బేగ్‌లను ఐపీసీ సెక్షన్లు 304బి, 498ఏ మరియు కట్న నిషేధ చట్టం సెక్షన్లు 3, 4 కింద దోషులుగా తేల్చింది. అయితే అలహాబాద్ హైకోర్టు 2003లో ఆ తీర్పును రద్దు చేసింది.
హైకోర్టు చట్టపరంగా, వాస్తవాల పరంగా తప్పుదారి పట్టిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, నిర్దోషిత్వాన్ని రద్దు చేసి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించింది. పేదరికం కారణంగా కట్న డిమాండ్ అసాధ్యమన్న హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాంటి నిర్ణయం తర్కానికి అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.
వివాహానికి ముందు లేదా తర్వాత కట్నం అడిగినా కట్న నిషేధ చట్టం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే 94 ఏళ్ల వయసున్న జమీల బేగ్‌ను జైలుకు పంపడం వల్ల ప్రయోజనం ఉండదని భావించి ఆమెను కారాగారానికి పంపలేదు. అజ్మల్ బేగ్ మాత్రం నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
కట్నం రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు, ముఖ్యంగా ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. మహిళలను ఆర్థిక లాభాల వనరులుగా చూడడం నిర్మాణాత్మక వివక్షను బలపరుస్తుందని వ్యాఖ్యానించింది. కట్నం మొదటగా కుమార్తెల ఆర్థిక స్వావలంబన కోసం స్వచ్ఛంద బహుమతుల రూపంలో మొదలై, కాలక్రమంలో వ్యవస్థీకృత దురాచారంగా మారిందని కోర్టు తెలిపింది. దీనిని అన్ని మతాలు విస్మరించాయన్నారు. స్వాతంత్ర్యం రాజకీయ స్వేచ్ఛతో పాటు సామాజిక మార్పు తీసుకురావాల్సిందని, కట్నం వంటి మూఢాచారాలు ఆ రాజ్యాంగ దృష్టికోణానికి పూర్తిగా విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అందుకే కట్న చట్టాల అమలును మరింత బలపరచేందుకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.ఈ తీర్పును అన్ని హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని, ఆదేశాల అమలుపై పర్యవేక్షణ కోసం కేసును తదుపరి విచారణకు ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

