విమానాల రద్దు..రైల్వేకు ఫుల్‌ డిమాండ్!

6
- Advertisement -

ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల సందడి భారీగా పెరగడంతో, భారత రైల్వేకు డిమాండ్‌ పెరిగింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగానే రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 37 ప్రీమియం రైళ్లలో మొత్తం 116 అదనపు బోగీలను జతచేసింది. 114 అదనపు ట్రిప్‌ల్లో ఈ కోచ్‌లు అమలులోకి వచ్చాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

దక్షిణ రైల్వే అత్యధికంగా స్పందించి, 18 రైళ్లలో అదనపు చైర్ కార్, స్లీపర్ బోగీలను చేర్చింది. ఇవి డిసెంబర్ 6, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.అలాగే ఉత్తర రైల్వే 8 రైళ్లలో 3AC, చైర్ కార్ బోగీలను జతచేసి అధిక డిమాండ్ రూట్లలో సీట్లు అందుబాటులో ఉంచింది.

పశ్చిమ రైల్వే నాలుగు హై-డిమాండ్ రైళ్లలో 3AC, 2AC బోగీలను జోడించింది. ఇవి డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చి, పశ్చిమ ప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు ప్రయాణించే వారికి ఉపయోగపడుతున్నాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాజేంద్రనగర్–న్యూఢిల్లీ (12309) రైల్లో డిసెంబర్ 6–10 మధ్య ఐదు ట్రిప్‌లలో అదనపు 2AC బోగీలను జతచేసింది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్–న్యూఢిల్లీ రూట్‌లోని 20817, 20811, 20823 రైళ్లకు అదనపు 2AC బోగీలు చేర్చింది.

పూర్వ రైల్వే (ఈస్టర్న్ రైల్వే) ప్రాంతీయ, అంతర్రాజ్య డిమాండ్‌ను తీర్చేందుకు, మూడు ముఖ్య రైళ్లలో డిసెంబర్ 7, 8 తేదీల్లో ఆరు ట్రిప్‌లకు అదనపు స్లీపర్ బోగీలను జోడించింది. అదనపు కోచ్‌లతో పాటు, రైల్వేలు నాలుగు స్పెషల్ రైలు సర్వీసులు కూడా నడుపుతున్నాయి:

గోరఖ్‌పూర్–ఆనంద్ విహార్ టర్మినల్ స్పెషల్ (05591, 05592): డిసెంబర్ 7–9 మధ్య 4 ట్రిప్‌లు

న్యూఢిల్లీ–శహీద్ కెప్టెన్ తుషార్ మహాజన్ వందే భారత్ స్పెషల్ (02439, 02440): డిసెంబర్ 6న ఒక ట్రిప్ – జమ్ము ప్రాంతానికి వేగవంతమైన కనెక్షన్

న్యూఢిల్లీ–ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (04002, 04001): డిసెంబర్ 6, 7 తేదీల్లో రెండు ట్రిప్‌లు

హజ్రత్ నిజాముద్దీన్–తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (04080): డిసెంబర్ 6న సౌతర్న్ రీజియన్‌కు ఒకవైపు ట్రిప్

ఇలా రైల్వేలు, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు అన్ని ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచుతూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

Also Read:ఇండిగో సిబ్బందికి మద్దతుగా సోను సూద్

- Advertisement -