8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు నయం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడిన హరీష్… దిష్టిబొమ్మలు పంటను కాపాడుతాయి.. ఈ 16 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉండి, రైతుల గురించి ఒక్క మాట మాట్లాడరు అన్నారు.
16 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు?… పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా? చెప్పాలన్నారు. ఈ కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే సరిపోతుంది అన్నారు.
పత్తి రైతుల గురించి కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించరు, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగరు … కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అన్నారు. కేంద్ర అధీనంలో నడుస్తున్న సీసీఐ L1,L2,L3 విధానం తేవడం వల్ల, కపాస్ యాప్ తేవడం, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామనే నిబంధనలు తేవడం లాంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది అన్నారు.
Also Read:పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల..విచారణ
రాష్ట్రవ్యాప్తంగా స్పిన్నింగ్ మిల్లులన్ని రెండు రోజులుగా మూత పడ్డాయి.. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది… రాష్ట్రంలో పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారు.. అడ్డగోలుగా దళారుల వ్యవస్థ ఎక్కువైంది అని ఆరోపించారు.

