హైదరాబాద్‌లో తనకు లభించిన ఘన స్వాగతానికి ముచ్చటపడ్డారు రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్. రాష్ట్రపతి ఎన్నిక కొద్ది రోజుల్లో జరగనుండగా టీఆర్ఎస్ నేతలతో జలవిహార్ లో సమావేశమయ్యారు కోవింద్. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. తాను ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుంచి ఎన్నో భారీ హోర్డింగులు తనకు స్వాగతం పలుకుతూ కనిపించాయని, ఇంత ఘనస్వాగతం తనకు మరెక్కడా కనిపించ లేదని తెలిపారు. తనకు లభించిన ఘనస్వాగతానికి సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకో విషయానికి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వుందని, తాను యూపీకి చెందిన వ్యక్తినైనందున తనకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ హిందీలో ప్రసంగించారని చెప్పారు. పూర్వపు రాష్ట్రపతులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆర్ వెంకట్రామన్, అబ్దుల్ కలామ్ లు చూపిన దారిలో తాను నడుస్తానని అన్నారు. ముఖ్యంగా ఇక్కడి వారైన జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డిలు కూడా తనకు ఆదర్శమేనని తెలిపారు.బీజేపీ అధిష్ఠానం తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని అన్నారు. తాను నామినేషన్ వేసే సమయంలోనూ టీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తనపై పెట్టాలని భావించిన ఎన్డీయేకు, తనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు.