మిస్ వరల్డ్ కెనడా అందాల పోటీల్లో తెలంగాణ బిడ్డ ల్యాణపు శ్రావ్య ఫైనలిస్టు విభాగంలో ఎంపికైంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 1996లో జన్మించిన ఈమె ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చదువుకున్నారు. ఆ సమయంలో ఆమె తండ్రి రవికుమార్ ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉపాధి కోసం వీరి కుటుంబం కెనడాకు వెళ్లింది. ప్రస్తుతం శ్రావ్య కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఇప్పటికే ‘మిస్ నార్తర్న్ అల్బెర్టా వరల్డ్-2017’ కిరీటం గెల్చుకున్న యువతి..జులై 16 నుంచి 23 వరకు జరగబోయే ‘మిస్ వరల్డ్ కెనెడా’ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలో శ్రావ్య తప్పకుండా గెలుస్తుందని.. తనకు ఆత్మవిశ్వాసమే కొండంత బలమని చెప్పారు శ్రావ్య తండ్రి రవికుమార్. ఇప్పుడు ఆదిలాబాద్, ఖమ్మం వాసుల కళ్లే కాదు.. తెలుగు ప్రజల అందరి కళ్లూ ఆ పోటీలమీదే ఉన్నాయి. కెనడా అందాల కిరీటం గెల్చుకున్న అమ్మాయిగా రికార్డు నెలకొల్పనుందన్నది అందరి ఆశ. శ్రావ్య సాధించిన ఘనత పట్ల ఆదిలాబాద్‌లోని ఆమె మిత్రులు, పాఠశాల సిబ్బంది..ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ర్టానికి చెందిన యువతి కావడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో శ్రావ్యకు మద్దతు తెలుపాలని పలువురు ప్రచారం చేస్తున్నారు.