భారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. టీమ్ఇండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ లు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ 19 పరుగులు చేయగా గిల్-అభిషేక్ జోడీ తొలి వికెట్కు 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. ఆ తరువాత వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.
భారత ఇన్నింగ్స్లో 5 ఓవర్లు పూర్తికాగానే వరుణుడు తొలి సారి ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ పునఃప్రారంభమైన తరువాత సూర్య, గిల్లు తమదైన శైలిలో బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టారు. భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల సమయంలో వరుణుడు మరోసారి వర్షం అంతరాయం కలిగించాడు. ఆ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
వర్షం చాలా సేపు పడింది. వర్షం నిలిచిపోయినప్పటికి కూడా మ్యాచ్ను నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య అక్టోబర్ 31న మెల్బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

