రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి మ్యూజికల్ వరల్డ్ లో తనకంటూ సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా. ఆయనకు తెలుగు పరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఉంది. సినీ ప్రముఖులు అందరితోనూ సత్సంబంధాలున్నాయి.
రెండు పదుల ఏళ్లు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ఆయన తొలిసారి ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యారు. అందులో భాగంగా తమిళ్లో రూపొందుతున్న ఓ చిత్రాన్ని ప్రప్రథమంగా తెలుగులో డబ్ చేస్తున్నారు. కార్తి, రకుల్ ప్రీత్‌సింగ్ కాంబినేషన్లో తమిళంలో తెరకెక్కుతున్న `ధీరన్ అధిగారమ్ ఒండ్రు` అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ “`చతురంగ వేట్టై` చిత్రంతో సంచలన విజయం సాధించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ధీరన్ అదిగారమ్ ఒండ్రు`. ఆ చిత్రానికి తెలుగులో `ఖాకి` అనే టైటిల్ పెట్టాం. ద పవర్ ఆఫ్ పోలీస్ అనేది శీర్షిక. ఒక పాట, వారం రోజుల టాకీ పార్టు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆగస్టు నెలాఖరునగానీ, సెప్టెంబర్‌లోగానీ సినిమాను విడుదల చేస్తాం. జిబ్రాన్ వినసొంపైన సంగీతాన్ని అందిస్తున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన రియల్ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకుని ఈ కథ తయారు చేశారు.
ఎక్స్ ట్రార్డినరీ కాన్సెప్ట్… కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్షకులకు ఈ కథను అందించాలని ఈ సినిమా రైట్స్ తీసుకున్నాను. కార్తి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. మన దగ్గర టాప్ హీరోలందరూ పోలీస్ డ్రస్సుల్లో మెప్పించిన వారే. కార్తీ కూడా మన `విక్రమార్కుడు` తమిళ వెర్షన్లో పోలీస్ గెటప్‌లో చేసి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుని చేస్తున్నారు“ అని అన్నారు. అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, ఆర్ట్: కె.ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు : ఉమేశ్ గుప్తా,సుభాష్ గుప్తా.