భారత క్రికెట్ చరిత్రలో బౌలర్ గా, క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఊపిరి, ప్రేమమ్, మజ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాలకు సంగీతం అందించిన గోపీ సుందర్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని, జూలై 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ జకారియాస్‌కొచ్చి మాట్లాడుతూ, ”ఇప్పటివరకు క్రికెటర్ గా, బౌలర్ గానే పేరున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు ఈ సినిమాతో మంచి నటుడిగా కూడా పేరు వస్తుంది. అడ్వెంచర్ స్పోర్ట్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ రేసర్ గా ఎంతో ఈజ్ తో నటించాడు. ఈ చిత్రం ఖచ్చితంగా తనకు మంచి డెబ్యూ అవుతుంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా మొత్తం కొనసాగుతుంది.అయితే కేవలం స్పోర్ట్స్ యే కాకుండా ఈ చిత్రంలో యాక్షన్, మాస్, లవ్ ఇలా అన్నిరకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది.ఇలా బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా రావడం ఇదే ప్రథమం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుని, యూ సర్టిఫికేట్ పొందింది. గోవా, బెంగళూరు మరియు ఆస్ట్రేలియాల్లో ఈ చిత్రాన్ని ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా చిత్రీకరించాం. గోపీ సుందర్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలోనే మధురా ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుదల చేయనున్నాం” అన్నారు.
సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ సరసన నిక్కీ గల్రానీ, పెరల్ మానే జత కట్టనున్నారు. మకరంద్ దేశ్‌పండే ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సజిత్ పరుషన్,ఎడిటర్ః దిలీప్ డెన్నిస్,ఆర్ట్ః సాహస్ బాల,మాటలుః నందు తూర్లపాటి,సాహిత్యం: రాకేండు మౌళి వెన్నెలకంటి, సంగీతంః గోపీ సుందర్,నిర్మాతః రాజ్ జకారియాస్‌కొచ్చి ,దర్శకత్వంః సురేష్ గోవింద్.