ప్రధాని నరేంద్ర మోడీకి వైట్‌హౌజ్‌లో ఘన స్వాగతం లభించింది. రెడ్‌కార్పెట్ వెల్కమ్ అందుకున్న మోడీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వైట్‌హౌజ్ రోజ్‌గార్డెన్‌లో సంయుక్త ప్రకటనకు ముందు, ఆ తర్వాత వైట్‌హౌజ్‌ను వీడి వెళ్తున్న సందర్భంలోనూ మోడీ అమెరికా అధ్యక్షున్ని ఆపాయ్యంగా హత్తుకున్నారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. సమావేశం అనంతరం మోడీ, ట్రంపులు వైట్‌హౌస్‌లో ప్రఖ్యాత బ్లూ రూమ్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గోన్నారు.
అయితే అమెరికా పర్యటనకు మోడీ ఈ ఏడాది మొదట్లోనే రావాల్సి ఉందని.. కానీ ఓ చిన్పపాటి ప్రాంతంలో జరిగిన ఎన్నికల కోసం పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఈ సంధర్బంగా ట్రంపు వెల్లడించారు. ఈ సంధర్బంగా మోడీ కలుగజేసుకొని ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత యూపీ అసెంబ్లీలో మూడొంతుల మెజార్టీ దక్కించుకున్నట్టు మోడీ చెప్పగా.. అదో అద్భుతమైన విజయమని ట్రంప్ ప్రశంసించారు.
మోదీ అమెరికా పర్యటన ఆలస్యంపై భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ చాలా బిజీగా ఉన్నారన్నారు. ఇక పర్యటన షెడ్యూల్ విషయానికొస్తే.. అది ప్రధాని వీలును బట్టే ఉంటుందని.. అమెరికా రావడానికి జూన్ 26కి కుదిరిందని అన్నారు. కాగా, ట్రంప్ చెప్పిన సమయంలో భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా.. పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికలు జరిగాయి. అతి కీలకమైన యూపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన ఆ ఎన్నికలను ట్రంప్ చిన్నపాటిగా పేర్కొన్నారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ దేశ ప్రధానితో కలిసి డిన్నర్ చేయడం కూడా ఇదే తొలిసారి.