కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో శిక్షను అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆమె శిక్ష అనుభవిస్తున్న ముంబయి నడిబొడ్డున వున్న బైకుల్లా జైలులో తోటి ఖైదీలతో కలిసి విధ్వంసానికి పాల్పడటమే కాకుండా జైలు అధికారులపై దాడికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఆమెతో పాటు మరో 200 మంది ఖైదీలపై కేసులు నమోదుచేశారు.
జైలులో గుడ్లు దొంగిలించిందనే ఆరోపణలతో ఓ మహిళా ఖైదీని గత వారంలో అధికారులు తీవ్రంగా కొట్టారు.
దాంతో ఆమె మృతి చెందింది. దీంతో జైలు అధికారుల అమానుష ప్రవర్తన కారణంగానే ఆ మహిళ మృతి చెందిందని, ఇంద్రాణితో పాటు జైల్లో ఉన్న దాదాపు 200 మంది మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు.
జైల్లోని వస్తువులను ధ్వంసం చేశారు. గదులపైకి ఎక్కి కాగితాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. మహిళా ఖైదీ మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో 2015లో ఇంద్రాణి అరెస్టయిన విషయం తెలిసిందే. మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్‌లతో కలిసి షీనా దారుణంగా ఇంద్రాణి హత్య చేసి శిక్ష ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపార వేత్త పీటర్ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు.